janampulse
Breaking News

జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం..అర్హతలు ఏమిటంటే?

Jagananna Vidyadeevena scheme launched

నవరత్న కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మకమైన ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) ఏపీ ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. ఈ పథకం కింద పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఐటీఐ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఫార్మసీ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు సంబంధించిన ఫీజుల మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. కాలేజీలకు ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలు) ఒకసారి రీయింబర్స్‌మెంట్‌ చేసే ఫీజులను కూడా ఇకపై విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇదో గొప్ప శుభవార్త.

రూ.4 వేల కోట్లు విడుదల
2018–19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.1,880 కోట్లను, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రెండేళ్లకు కలిపి రూ.4వేల కోట్లు విడుదల చేసింది. అయితే 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించి ఉంటే.. ఆ మొత్తం ఏప్రిల్‌ నెలాఖరులోగా కాలేజీల నుంచి తిరిగి తీసుకోవచ్చని తెలిపింది. 2018–19, 2019–20లో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఫీజు కట్టి ఉంటే.. ఆ సొమ్మును కూడా తిరిగి తీసుకోవచ్చని తెలిపింది.

ఇకపై నేరుగా తల్లుల ఖాతాల్లోకి..!
ఇదిలా ఉంటే.. రానున్న విద్యా సంవత్సరం 2020–21లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా (నాలుగు త్రైమాసికాలకు) డబ్బు జమ చేయనున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా కాలేజీలకు వెళ్లడం, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవీ మార్గదర్శకాలు:

 • సాంఘిక సంక్షేమ శాఖ ఈ పథకానికి నోడల్‌ విభాగంగా పనిచేస్తుంది.
 • ఫీజులపై రాష్ట్ర ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ నోటిఫికేషన్‌కు కాలేజీలు అంగీకరించి ఉండాలి.
 • ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు భిన్నంగా క్యాపిటేషన్‌ ఫీజు వంటి ఇతర అనధికారిక ఫీజులు (డొనేషన్లు లాంటివి) వసూలు చేయకూడదు.
 • విద్యాసంస్థ నిర్వహణలో మిగులు లాభాన్ని తన సొంతానికి కాకుండా తిరిగి సంస్థ కోసం వెచ్చించాలి.
 • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రాలేదనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయకూడదు.
 • యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఏపీఎస్‌సీహెచ్‌ఈ లాంటి నియంత్రణ సంస్థల ఆదేశాలను పాటించాలి.
 • ఆన్‌లైన్‌ అఫిలియేషన్‌, అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలి.
 • ప్రతి విద్యార్థికి సంబంధించిన అకడమిక్‌ పెర్ఫార్మెన్సు తదితర రికార్డులను సంబంధిత విభాగాలకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
 • విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా ఆధార్‌ అనుసంధానిత బయోమెట్రిక్‌ హాజరు ద్వారా నమోదు చేయాలి.
 • విద్యార్థులకు 75 శాతం కన్నా హాజరు తగ్గితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు.
 • సెక్యూరిటీ, డేటా గోప్యత ప్రోటోకాల్‌ను పాటించాలి.
 • ప్రభుత్వం, సంబంధిత రెగ్యులేటరీ సంస్థలు అనుమతించే కోర్సులతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిర్దేశించిన కోర్సులను మాత్రమే నిర్వహించాలి.
 • మార్గదర్శకాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, యాజమాన్యాలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. ఆ కాలేజీలను ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నుంచి తప్పిస్తారు.
 • ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిర్దేశించిన ఆదాయ పరిమితి ప్రకారం గుర్తింపు కలిగిన సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది.
 • డీమ్డ్‌ వర్సిటీలు, ప్రైవేట్‌ వర్సిటీలకు ఈ పథకం వర్తించదు.
 • దూర విద్య, కరస్పాండెన్స్‌ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్థులకు ఈ స్కీము వర్తించదు.

వార్షికాదాయ పరిమితి:

 • కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ వర్గాల వారికి, దివ్యాంగులకు విద్యా దీవెన పథకం వర్తిస్తుంది.
 • బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే, బీఈడీ వంటి కోర్సులకు కూడా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్
 • ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు కాలేజీలు, యూనివర్సిటీలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పథకం వర్తింపు.
 • పది ఎకరాల లోపు మాగాణి లేదా 25 ఎకరాల లోపు మెట్ట ఉన్న వారికి లేదా ఈ రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వర్తింపు.
 • పట్టణాల్లో 1500 చ.అ. లోపు స్థిరాస్థి ఉన్న వారికి పథకం వర్తింపు
 • ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
 • ట్యాక్సీ, ఆటో, ట్రాక్డర్ నడుపుతూ జీవిస్తున్న కుటుంబాల వారికి ఆదాయ పరిమితి నిబంధన మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఇలా..!

 • ఆయా కాలేజీల యాజమాన్యాలే అర్హత గల విద్యార్థుల పూర్తి వివరాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఆయా విభాగాల్లో అప్‌లోడ్‌ చేస్తాయి.
 • వార్షిక ఆదాయ పరిమితి పెంచినందున తహశీల్దార్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని పరిగణలోకి తీసుకుని కొత్త విద్యార్థులకు అర్హత కల్పిస్తారు.

అవసరమైన ధ్రువపత్రాలు:

 • రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌
 • ఆధార్‌ కార్డ్‌
 • కాలేజీ అడ్మిషన్‌ సర్టిఫికెట్‌
 • అడ్మిషన్‌ ఫీజు రిసిస్ట్‌
 • బీపీఎల్‌ లేదా ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌
 • తల్లిదండ్రుల వృత్తి ధృవీకరణ పత్రం
 • నాన్‌ ట్యాక్స్‌ పేయర్‌ డిక్లరేషన్‌
 • బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు

వెబ్‌సైట్‌: www.ap.gov.in

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.