janampulse
Breaking News

మోదీ గుడ్ న్యూస్.. రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ

janampulse-telugu

కరోనా లాక్‌డౌన్‌తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తూ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రూ. 20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. రోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ప్రధాన రంగాలన్నీ కుదేలైన వేళ భారత ప్రధాని మోదీ.. దేశ వాసులకు శుభవార్త అందించారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. కరోనా మహమ్మారితో కుదేలైన రంగాలన్నింటికీ ఈ భారీ ప్యాకేజీ గొప్ప ఊరట కల్పించనుంది. దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఇది కొత్త ఊపిరి కల్పించే అవకాశం ఉంది. రెండు నెలలుగా స్తబ్ధత నెలకొన్న ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఊపందుకోనుంది.

మంగళవారం (మే 12) రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దేశ జీడీపీలో ఇది 10 శాతమని వెల్లడించారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఊతమిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తారని ఆయన తెలిపారు. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మరో కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నామని ప్రధాని పేర్కొన్నారు. జన్‌ధన్‌ అభియాన్‌తో ఒక విప్లవాన్ని చూశామని గుర్తు చేసిన ప్రధాని.. ఇప్పుడు మరో కొత్త విప్లవానికి నాంది పలకబోతున్నామని చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాయంపై ప్రభావం పడకుండా ఏర్పాట్లు, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుందని అన్నారు.

‘ప్రపంచ పంపిణీ వ్యవస్థలో భారత్‌ది కీలక పాత్ర. మేకిన్‌ ఇండియా కల సాకారం చేయడానికి ఈ ప్యాకేజీ దోహదం చేస్తుంది. మన సామర్థ్యం, ఉత్పత్తిలో నాణ్యత అన్నింట్లోనూ నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుంది. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ (జామ్‌) సూత్రం దేశానికి ఇప్పటికే ఎంతో ఉపయోగపడింది’ అని మోదీ అన్నారు.

21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగినట్టుగా ఈ ప్యాకేజీ రూపకల్పన చేశామని మోదీ చెప్పారు. నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందని చెప్పారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ప్యాకేజీ ఉపయోగపడుతుందని.. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు దోహదపడుతుందని మోదీ పేర్కొన్నారు.

నాలుగో దశ లాక్‌డౌన్‌కు కొత్త రూపురేఖలు ఇస్తామని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి నిబంధనలు ప్రకటిస్తామని తెలిపారు. స్థానిక మార్కెట్టు, స్థానిక పంపిణీ వ్యవస్థలు బలో పేతం కావాలని ప్రధాని అభిలషించారు. కరోనాపై విజయం సాధించేందుకు దేశవాసులందరూ కలిసి పోరాడుతున్నారని మోదీ కితాబిచ్చారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ శక్తి ఏమిటో ప్రపంచానికి అర్థమైందని అన్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.