janampulse
Breaking News

చంద్రబాబు సంచలన లేఖ..ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు

తిరుమల ప్రతిష్టను కాపాడాలని.. సాంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలన్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించవలసి వస్తుందన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు  TDP అధినేత  చంద్రబాబు Letter రాశారు. తిరుమల పుణ్య క్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక అన్నారు. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమని.. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థగా పేరు ప్రఖ్యాతి కలిగిన టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదన్నారు. భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్తులు, కళంకితులకు చోటు కల్పించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హణీయమన్నారు బాబు.గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయలేదని.. ఈ జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. స్వామివారిపై భక్తి భావంతో, స్వామివారి సేవలో తరించే వారికి బోర్డులో ప్రాధాన్యమివ్వకుండా.. కొంతమంది వ్యక్తుల సేవలో మునిగి తేలే వారికే అవకాశం ఇచ్చారన్నది సుస్పష్టమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో జంబో బోర్డు ఏర్పాటు చేశారన్నారు.

అనర్హులను సభ్యులుగా నియమించి శ్రీవారి ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను కించపరిచారన్నారు టీడీపీ అధినేత. సామాన్య భక్తుల దర్శనాలకు రకరకాల నిబంధనలు విధించి.. వీఐపీల సేవలో తరించే విధానాన్ని ప్రస్తుతం చూస్తున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సాంప్రదాయాలను గాలికొదిలేసి తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని.. ధర్మకర్తల మండలిలో సభ్యత్వమంటే భక్తి భావానికి ప్రతీకగా ఉండేదన్నారు. గతంలో సభ్యత్వం కల్పించాలనుకుంటే వారి వ్యక్తిగత గుణ గణాలను పరిశీలించి బోర్డులో సభ్యత్వం కల్పించేవారన్నారు. కానీ నేడు స్వప్రయోజనాల కోసం.. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారన్నారు. సేవాభావమే జీవిత లక్ష్యంగా ఉండే వారిని గతంలో ధర్మకర్తల మండలిలో నియమించడం జరిగిందన్నారు చంద్రబాబు. కానీ నేడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను కూడా సభ్యులుగా నియమించి బోర్డు పవిత్రతను దెబ్బతీశారన్నారు. గత రెండున్నరేళ్లుగా తిరుమల పవిత్రత, ప్రాశస్త్యం దెబ్బతింటున్నదని.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ టీటీడీ ఆస్తుల వేలానికి పూనుకున్నారననారు. తిరుపతి-తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారని.. టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత గేయాలు, స్విమ్స్‌ ఆసుపత్రిలో అన్యమత ప్రచారం, ఎస్వీబీసీ ఛైర్మన్‌ రాసలీలలు, భక్తుల తలనీలాల స్మగ్లింగ్‌, టీటీడీ మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరించడం, లడ్డూ ప్రసాద ధరలు పెంచడం, భక్తి శ్రద్దలతో స్వీకరించే శ్రీవారి ప్రసాదాన్ని ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేయడం వంటి అనేక అనైతిక చర్యలు చోటు చేసుకున్నాయన్నారు.

శ్రీ వేంకటేశ్వరుడి తిరునామాలకు తప్ప.. మరో చిహ్నానికి తావులేని తిరుగిరుల్లో డివైడర్లకు వైసీపీ రంగులు వేశారన్నారు. కొండపై వైసీపీ నేతలు రాజకీయ ప్రచారం చేశారని.. నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లు ఎగరేశారని.. ర్యాలీలు నిర్వహించారన్నారు.ధర్మకర్తల మండలి ఏర్పాటులో భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలతో పాటు, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల ప్రతిష్టను కాపాడాలని.. సాంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలన్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించవలసి వస్తుందన్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.